Sunday, October 5, 2008

సంక్రాంతి

ఊరిమధ్యన
భోగిమంటల నెగళ్ళు
రంగు రంగుల
ముగ్గు మధ్యన గొబ్బిళ్ళు

కన్నె పిల్లల
సిగ్గు మొగ్గల లోగిళ్ళు
కోరి మరదలితో
సరసాలాడే కొత్త అల్లుళ్ళు

హరిలో రంగ హరియని
హరిదాసుల చిడతల చప్పుళ్ళు
అమ్మమ్మలు చేసిన అప్పచ్చులతో
నిండిన చిన్నారుల గుప్పిళ్ళు

"నవ"ధాన్యాలతో
కళ కళ లాడే అంగళ్ళు
కొత్త బియ్యము
పొంగించి చేసిన పొంగళ్ళు

పసి బిడ్డలకు
భొగిపళ్ళ కొలువుదీరు ఉత్సవాలు
రైతుబిడ్డలకు
భోగభాగ్యాల ఆనందోత్సాహాలు

విను వీధిన విహంగమల్లే విహరించే
గాలి పటాలు
కొత్త బంగారు లోకానికి తెరిచే
తొలి కవాటాలు

ఇవీ ఆనాటి ఆ సంక్రాంతి సంబరాలు..

కాని,
ఇప్పుడేవీ
ఆ భోగ భాగ్యాలు,
ఇప్పుడేవీ
ఆ చిరునెగళ్ళ భోగి మంటలు

ఇప్పుడంతా..
కరువుకాటకాలతో రోగ-అభాగ్యాలు
నిప్పులేని e-భోగిమంటలు
ఇప్పుడేవీ ఆ రంగు రంగుల ముగ్గులు
ఇప్పుడంతా కళాకంతులు లేని e-ముగ్గులు
స్వచ్చత లేని కృత్రిమమౌ e-సిగ్గులు
గాలి లెకుండానే e-గగనాన
ఎగిరే e-గాలిపటాలు

అయినా కొరతేమీ లేదు నేస్తం,

ఆ సంక్రాంతి పోయింది...
e-సంక్రాంతి వచ్చింది...

ఆత్మీయుల సమాగమం తో అలరారెను
ఆ సంక్రాంతి
e-మిత్రుల పలకరింపులతో సందడి చేసెను
e-సంక్రాంతి

ఆ సంక్రాంతి అయినా..
e-సంక్రాంతి అయినా..
సంతోషమొక్కటే
సంబరమొక్కటే

ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా
e-స్నేహితులతో ..
e-తరం మనుషులతో జరుపుకుంటున్న
ఈ సంక్రాంతి...అదే e-సంక్రాంతి
కావాలి అందరిని మురిపించే
ఆ తరం సంక్రాంతి..
తేవాలి మనందరిలో
సరి కొత్త క్రాంతి !!!

-Anonymous

No comments: