Sunday, October 5, 2008

మౌనం

శశి రాక కోసం
నిశి రాతిరి వేళ
కనులు కాయలు కాచిన
కలువ బాల విరహగీతం - మౌనం

నులివెచ్చని కిరణానికి
తొలి సంధ్య వేళ
మౄదు రేకు విచ్చిన
కమల కన్నె దరహాస గీతం - మౌనం

ఎల కోయిలను పిలవాలని
నవ వసంత వేళ
తొలి చిగురు తొడిగిన
లేత మావి కొమ్మ స్వాగత గీతం - మౌనం

సెలయేటి అలల పై
నిండు పున్నమి వేళ
తనివార తేలియాడే
చిరు తెమ్మెర తేట గీతం - మౌనం

కొండ కోనల తిరిగి
కర్షకుల కలలు పండించి
కడలి ఓడిలో సేద తీరే
నదీమతల్లి సంగమ గీతం - మౌనం

ప్రతి కదలికలో
ప్రతి కవళికలో
ప్రతిఫలించే సౌందర్యం
ప్రకృతి కాంత పరవశ గీతం - మౌనం

- Anonymous

No comments: